అమృతవర్షిణి

రండి రండి ...


సమాజపు టందచందాల్ని
చందమామలో బంధించినవాడు
వీడు ప్రబంధకవి
సమాజపు టున్నత శిఖరాలపై
బావుటాలనెగరేసినవాడు
వీడు భావకవి;
సమాజపు మెరకపల్లాల చదును పేరుతో
గతాన్ని వెక్కిరించినవాడు
వీడు అభ్యుదయ కవి
సమాజపుటాకటి గొంతుల్లో నిలబడి
తుపాకులు పేల్చినవాడు
వీడు విప్లవకవి
సమాజపుటిరుకు సందుల్లో దూరి
చడ్డీవిప్పుకు తిరిగినవాడు
వీడు దిగంబర కవి
సమాజానికందని లోకాల్లో తిరుగుతూ
సూక్తులు వల్లించినవాడు
వీడు పైగంబర కవి
సమాజంతోనే సంబంధం లేకుండా
అడవులూ ఎడారులూ పట్టినవారు
వీరు చిల్లర కవులు
ఇదిగో కవుల కొలువు తీర్చాను-రండి రండి
ఎవరికి నచ్చిన బొమ్మలు వారేరుకోండి
- ఇట్లు, గ్రంథాలయం.

ఏ దారైతేనేం?


కోటి రంగులు చిందించే
సీతాకోక చిలుక
గొంగళి పురుగును చూచి
ఛీ...ఛీ...అందట
కాకి దయదలచి పొదగందే
కోకిలా లేదు,
కోకిల పాటా లేదు.
సాగర తీరం ముందు చేరుకున్నవారు
శంఖాలూ ముత్యాలూ ఏరుకున్నారు.
కడాఖరు వాడికి
గవ్వలూ గులకరాళ్లూనూ.
ఎవరి ప్రాప్తం వారిది.
సిద్ధాంతికి
సింహావలోకనం వరకే
సింగారం.
చిఱ్ఱు బుఱ్ఱులు కావు.
లక్ష్యాన్ని చేర్చేదేదారైతేనేం?
లక్షణంగా సాగిపోక-

సునీత


పారిజాతం జీవితమెంత...
ప్రకృతిలో దాని పరిమాణమెంత
అయితేనేం...
బ్రతుకంతా నవ్వుల జల్లులు,
పరిసరాలు పరిమళ భరితాలు.
అందుకే...ఆమె
యీ సృష్టికే సునీత,
నా దృష్టికి పునీత.

కథిక


శని
మానిసి
నకనక
కనకన
సినిమా
నిశ

తేడా


'నీ'కూ 'నా'కూ తేడా
శరీరం ఒక్కటే
ప్రాణాలు వేరు
నీకూ నాకూ తేడా
శరీరాలు వేరు
ప్రాణం ఒక్కటే

మనిషి


మనిషి
తనలోని 'నీ'ని గౌరవిస్తే
మనీషి
దాన్ని పూర్తిగా విస్మరిస్తే
వికృతినొంది... అతడు
మసి.

క (+అ) షాయం[మార్చు]


రంగువేస్తే కాదు కాషాయం...
రంగరిస్తే రాదు కషాయం.
అనుభవాల ఉతుకులలో
అనవరతం నలిగి నలిగి
అంతరంగపు వలువ తెలుపు
అవుతుంది కాషాయం.
వయసు పండించిన జీవనౌషధిని
కాలం కలంలో నూరి నూరి
కలం కాలంలో కాచివడబోసి
కళ్లు తెరిచేవాళ్లకు పోస్తే
అదీ కషాయం.

త్రాగు

త్రాగు
బాగా త్రాగు
కడుపు నిండా త్రాగు
కళ్లు మూతలు పడేదాకా త్రాగు
సారాకాదు
నీరాకాదు
బీరూకాదు
గీరూకాదు
నీ జీవిత సహచరిణి ఎదలోని
ప్రేమ,
నీ బిడ్డల చిలిపి కళ్లలోని
అనురాగం,
నీ హితుల హృదయాలలోని
స్నేహం,
నీ ఇరుగు పొరుగు ఎదలలోని
సంఘీభావం...
త్రాగు
బాగా త్రాగు
కడుపు నిండా త్రాగు
కళ్లు మూతలు పడేదాకా త్రాగు

కార్తీక దీపాలు


ఆకాశంలో చందమామకి
కాస్తంత మబ్బుతునక అడ్డొస్తే
కొంపలు మునిగినట్లు
చెంపలు తడుపుకుంటావు
వినువీథిలో విహంగాలనీ
వనవీథిలో కురంగాలనీ
చూచి వాటి స్వాతంత్ర్యానికి
వళ్ళంతా ఈర్ష్య నింపుకుంటావు
నీ అట్టహాసాలతో అహంభావాలతో
ప్రమేయం ప్రసక్తి లేకుండా
ప్రకృతి ఒడిలో కమ్మగా పాలుత్రాగే
కార్తీక దీపాల్ని చూచెందుకసహ్యించుకుంటావు?
వేడెక్కిన చిమ్నీలో
బంధించిన లక్ష్యంలో
సాధించిన స్వార్థంలో
పయనించే నువ్వు -
నిజధ్వస్త ఇజంతో
రుజాగ్రస్త భుజంతో
భుజస్రస్త ధ్వజంతో
ఊరేగే...నువ్వు...
సరసున పద్మాల్లా
సరసన భృంగాల్లా
సురసన ఝంకారాల్లా
చెలరేగే సుమధూళుల్లా
పడిలేచే కెరటాల్లా
లేచిపడే సెలయేరుల్లా
మదనుడి కత్తుల్లా
సురాపాన మత్తుల్లా
'నిన్న 'కి సున్నా చుడుతూ
'రేపు 'ని పో-బే- అంటూ
నేడనే వినాయకుడికి
కళ్ళల్లో కల్లును కొట్టే
గిరిచర వనచర శ్రేణికి
బ్రతకడం నేర్పుతావా?!
గిరిగీసి కూర్చోబెడతావా?
నీ నాగరికత నగారాలతో
ఆ చెవులకు చిల్లులు పొడవకు
నీ సంస్కృతీ తటిల్లతలతో
ఆ కన్నుల మిరుమిట్లు గొల్పకు
క్రుళ్ళిన నీ సాంఘిక గంధం
ఆ ముక్కుల సోకనీయకు
గులాబీలకు రంగులు వేయకు
మల్లెలపై కన్నీరు చల్లకు
కృత్రిమ రక్షణ పేరున
ఆ దీపాలార్పివేయకు

ఇష్టకాలు

నేర్చుకోవడం కోసం బ్రతికేవాళ్ళు
బ్రతకడం నేర్చుకునేవాళ్ళ చేతిలో
పుస్తకాలు.
బ్రతకడం నేర్చుకునేవాళ్ళు
నేర్చుకోవడం కోసం బ్రతికేవాళ్ళ
మస్తకాలు.
ఏదో బ్రతుకులు వెళ్ళదీసేవాళ్ళు
ఇద్దరి బ్రతుకుల పునాదులకూ
ఇష్టకాలు.

ఆలయం


భౌతిక శాంతికి వైద్యాలయం
బౌద్ధిక శాంతికి విద్యాలయం
మనశ్శాంతికి దేవాలయం
ఆత్మశాంతికి ప్రణయాలయం
లేక
ప్రళయాలయం

మేక్రో మైక్రోబు


అవకాశాన్ని బట్టి ఆకారం మార్చుకొనే
ఓ టిటానస్ స్ఫోరూ -
అనువు కుదిరేదాకా దొంగెత్తువేసే
ఓ వైరస్ మహాశయా...
మీ యిద్దరూ మహా
గొప్పవారమని విర్రవీగకండి.
మిమ్మల్ని తలదన్నే మేక్రో మైక్రోబు ఉంది సుమా
ఈ దేశంలో!!!
అవకాశవాదం ఆరగిస్తూ
వాగ్దానాలు విసర్జిస్తూ
కాలానికి సహితం తలొగ్గకుండా ఉంది
రాజకీయాల్లో రాణిస్తూ.

అయోమయం


ఓరోజు...
ఆ రోజు
ఉదయారుణ ద్యుమణికై
హృదయాబ్జము నింపిన దోసిట
పట్టిన అర్ఘ్యంలో
పుట్టిన అతి వింత... అది అధివింత?
ఉజ్వల కాంతి పుంజం
ఊదిందొక భ్రాంతి వలయం
అందెన్ని తారలో... తరగలో!!
అండాకృతిలో గెలాక్సీ...యూనివర్స్.
విశ్వావిర్భావంలో
వినిపించిందొక శబ్దం...వినిపిస్తూనే ఉంది.
అదే సెలెస్టియల్ సౌండో!...
అదే ఓంకార రవం!
కనుమూసిన కనులకు
కనిపించే ప్రతి వింతా
కనిపించని నిజాన్ని
కథగా చెప్పుకు పోతోంది.
నడుమ మిగిలి...తిరిగి
నాలుగైన ఆ తిమిర హంత
నా దృష్టికి మాత్రం ఒక్కటిగానే నిలిచింది
నాలుగు తలల బ్రహ్మంటే... అదే...అదే
వెలుగు పింజలో వ్రేల్లాడే
కోట్ల కోట్ల సూర్యగోళాల్లో
ఒకదాని సరసన...నేనూ, నా భూమీ...
నా చుట్టూ జావిల్లీ, నేను దినకరుని చుట్టూ...
అంతా కలసి
అయోమయం చుట్టూ,
అల్లి బిల్లి తిరుగుతూ
అనంత దూరాన్ని
తరుగుతున్నాం... తరుగుతున్నాం.
నాలాగే
నాకు ముందూ, వెనకా...
మరో పదిరెండు సూర్యుల చుట్టూ... వీగాస్ చుట్టూ
తిరిగే గ్రహాలలో
పెరిగే జీవాలు
మినుకు మినుకు మంటున్నాయి.

ఎక్కడిదీ న్యాయం?[మార్చు]


ప్రకృతికి కోపమొచ్చి
తుఫాను సృష్టిస్తే
పోయేవి పూరిగుడిసెలే
ప్రజావళికి కోపమొచ్చి
విప్లవం ప్రకటిస్తే
పోయేవి ఆ బక్క ప్రాణాలే
ప్రభువుల రాచరికమైనా
ప్రజా ప్రభుత్వమైనా
పూరిగుడిసెలున్నంత వరకూ
ఈ న్యాయం ఇంతే.

స్థాతుం నియోక్తుర్నహి ...


"త్వరలో ధరల్లో తగ్గులేనిచో
తలుపులు తెరిచే ఉంచాం జైళ్ళకు"
వర్తకులకు హెచ్చరిక... కాదిది
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిది.
పోయిన కాలం పిండిన రక్తం...ఎన్నాళ్ళకు పూడుతుంది మళ్ళీ?
ఇంకా కండలు కొరికే దోమలకేమైనా వేశారా మందు?
పండించేవారికి, పంచిపెట్టేవారికి పట్టెడన్నం లేదు కడుపునిండా...
పాలకులకూ వారి సేవకులకూ
పంచభక్ష్యాలకు లేదు లోటు.
స్వేచ్ఛావిపణిలేదు, పండించే స్వేచ్ఛ లేదు.
విత్తు చల్లింది మొదలు ఇల్లు చేర్చే వరకూ
పదిమందికైనా ఇవ్వాలి మామూళ్ళు.
సేకరణకూ... పంపిణీకీ మధ్య
వందమందైనా ఉంటారు మేతగాళ్ళు.
మేపగూడదనే నియమాన్ని అధికార దుర్వినియోగం కాటేసింది.
కబోది న్యాయస్థానాలమీద రాజకీయాలు స్వారీ చేస్తున్నాయి.
ఫలితం... ...
మేసేవాళ్ళకు మేపేవాళ్ళకు మధ్య ఘర్షణ.
నిత్యావసరవస్తువుల ధరల స్థిరీకరణ.
అందుకే అంటాను-
ప్రభుత్వ యంత్రాంగం పటిష్ఠం కానంతవరకు
ప్రభుత్వానికి వర్తకులను బెదిరించే హక్కు లేదని.
ప్రభుత్వం అంటే...
ప్రజలనూ వారి అవసరాలనూ రక్షించడానికి ఎన్నుకోబడింది.
ప్రజలంటే...
రైతు, వ్యాపారి, పనివాడు, అంతే.
ప్రజలను బెదిరించే ప్రభుత్వాల
బ్రతుకులు చూస్తూనే ఉన్నాం.
ప్రజలు తనకిచ్చిన బాధ్యత నిర్వహించినపుడే
ప్రభుత్వానికి వారి ముందు నిలచే యోగ్యత.
స్థాతుం నియోక్తుర్నహిశక్యమగ్రే
వినాశ్య రక్ష్యం స్వయమక్షతేవ-

ఏం రాజువయ్యా!


ఎవరయ్యా నువ్వు ?
ఒహో... రైతువా?
అంటే యీ దేశానికి రాజువన్నమాట.
అవునూ .. ఎందుకలా వణికిపోతున్నావ్?
... ... ఎస్సైగారా... అయితే?
వచ్చేస్తున్నాడంటావా...
ఏం! ఏమైనా తప్పు చేశావా?
లేదూ...మరెందుకయ్యా...
భటుడికి భూపతి భయపడతాడటయ్యా యెక్కడన్నా?
ఓర్నీ ఇల్లు బంగారం కానూ ...
ఏమిటిదీ...
ఏదో బేనర్ కట్టారల్లే వుందే...
...సెక్రటరీ టు ది గవర్నమెంటు వారికి
సుస్వాగతమా...!?
ఎవరయ్యా ఈ ఆహ్వానించేది?
మీరేనా... అవ్ వ్ వ్వ.
వాడు మీకు పెద్ద పాలేరు-
వాణ్ణి మీరాహ్వానించడమేమిటి?
ఏమిటీ... వీరు మీ ప్రతినిధిగారికి మంత్రిగారా!
వీరి సలహామీదనే వారు నడుచుకుంటారా?!
అంటే మీ ప్రతినిధివారు స్వయంగా ఆలోచించలేరా?!
హతవిధీ!
నువ్వేం రాజువయ్యా...
సరైన ప్రతినిధిని నియమించుకోలేవు
ఇంక నీ రాజ్యం నిల్చినట్లే.
(ఓ స్వాగత తోరణం చూచి).

స్వయంసేవ


దుర్ముహూర్తానికో దుర్యోధనుడు పుడుతూనే ఉన్నాడు -
అయినా కుక్కలెక్కడా మోరచాచి మొరుగుతున్న జాడలేదు.
పగలే యములాళ్ళు మసలుతున్నా
వాటికింకా చిత్తకార్తె మైకం దిగలేదు.
అదిన్నీ; ఇదివరకటిలా అవి
ఇంటిముందు కూర్చోవడం లేదు
ఇంట్లోనూ వీధిలోనూకూడా
వీటి ధాటి కెదురులేదు.
దొంగలు పెట్టే రొట్టెలు మరిగి
యజమానుల్నే దొంగదెబ్బ తీస్తున్నాయి.
అరెరె...ఏమిటా అరుపులు...
ఏమిటీ... కుక్కల తిరుగుబాటా!
అయితే
ఏదో ఒక తప్పని విపరీతానికి
ఇది తప్పకుండా నాంది.
ఇకనైనా మైకం దింపుకో
నివాసం కోల్పోయిన విశ్వాసాన్ని
నీవైనా చేరదియ్యి.
నీ కాళ్ళమీద నిలబడి
నిన్ను నువ్వైనా కాపాడుకో.